PM Modi in Shanghai meeting: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో పోరాడుతున్న అనేక దేశాలకు ఇప్పుడు ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యలుగా మారాయని మోదీ అన్నారు. వీటిని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
పాక్ పై పరోక్షంగా విరుచుకుపడిన ప్రధాని మోదీ ..(PM Modi in Shanghai meeting)
ప్రధాని మోదీ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ సమావేశం మంగళవారం జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో పాటు ఇతర సభ్యదేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాక్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వంటి వాటిని నిరోధించేందుకు నిర్ణయాత్మక చర్యలు అవసరమన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి ఎన్నడూ వెనుకాడకూడదన్నారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ షాంఘై సహకార సంస్థ అనేది కేవలం పొరుగున్న దేశాల కూటమి మాత్రమే కాదు.. మనమంతా ఒకే కుటుంబం. భద్రత, ఆర్థికాభివృద్ధి, అనుసంధానత, ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవడం, ప్రాదేశిక సమగ్రత, పర్యావరణ పరిరక్షణ.. ఇవన్నీ మన సదస్సు మూల స్తంభాలు అని తెలిపారు. ఇక ఈ సదస్సులో భాగంగా ఉక్రెయిన్‌లో అనిశ్చితి, వాణిజ్యం తదితర అంశాలపై నేతలు చర్చించారు.