Site icon Prime9

Telangana Students: మణిపూర్ నుంచి క్షేమంగా హైదరాబాద్‌ చేరుకున్న విద్యార్థులు

telangana students

telangana students

Telangana Students: మణిపుర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి విద్యార్థులను శంషాబాద్‌ తీసుకొచ్చారు. అనంతరం ఆయా విద్యార్థులను ఎయిర్‌పోర్టు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లోవారి సొంత ఊర్లకు పంపారు. కాగా, ముందు ఆదివారం సాయంత్రానికి విద్యార్థులను తీసుకుని రావాలనుకున్నారు. అయితే అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విద్యార్థులను తీసుకురావడం సోమవారానికి వాయిదా పడింది.

 

 సురక్షితంగా వచ్చిన 250 మంది(Telangana Students)

మైతీలను ఎస్టీలో చేర్చాలనే డిమాండ్ కు అనుకూలంగా కేంద్రానికి సిఫార్సు పంపాలని ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. దీంతో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను, తెలంగాణ వాసుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల సహాయార్థం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ తో పాటు హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక కంట్రోల్‌రూమ్ లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లు మణిపుర్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులతో పాటు తెలంగాణవాసులు సుమారు 250 మంది ఉన్నట్లు గుర్తించి, వారిని తరలించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానం పంపారు. అక్కడి నుంచి సోమవారం మధ్యాహ్నానికి హైదరాబాద్ తీసుకొచ్చారు.

 

అదుపులోకి ఘర్షణలు

మణిపూర్ లో నెలకొన్న ఘర్షణ వాతావరణం క్రమక్రమంగా చల్లారుతోంది. మైతీ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌ను స్థానిక గిరిజన జాతులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల చెలరేగిన హింస ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించారు. దాంతో ప్రజలు రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఘర్షణలతో తీవ్రంగా ప్రభావం చూపిన చురాచాంద్‌పుర్‌ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు. కర్ఫ్యూ సడలించడం వల్ల నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆహారం, మందులతో పాటు అత్యవసర వస్తువులు తీసుకెళ్లెందుకు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. దాదాపు 120 నుంచి 125 సైనిక యూనిట్లను మణిపూర్‌ రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. దాదాపు 10 వేల మంది సైనికులు, పారామిలటరీలు, కేంద్ర బలగాలు మణిపూర్‌లో పహారా కాస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Exit mobile version
Skip to toolbar