TDP chief ChandraBabu Naidu: ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీఈసీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కంప్లైంట్ చేశారు.
ఇలాంటి చెత్తపనులు చేయలేదు..(TDP chief ChandraBabu Naidu)
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఓట్ల తొలగింపుపై కోర్టుకు కూడా వెళ్లాం.స్థానిక ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బెదిరించి భయపెట్టి విత్‌డ్రా చేయించారని అన్నారు. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి చెత్త పనులు చేయలేదు.సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ పెడితే కేసులు పెడుతున్నారని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఢిల్లీకి వచ్చానని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని సమస్య వచ్చిందన్నారు. నకిలీ ఎపిక్ కార్డులు ప్రింట్ చేస్తున్నారని తెలిపారు. ఒక పార్టీ ఓట్లు తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదని మొదటిసారిగా అపోజిషన్ పార్టీలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. బూత్ లెవెల్ అధికారులు వారికి సహకరిస్తున్నారని విచారణ చేయకుండానే ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో జీరో డోర్ నెంబర్ తో పలు ఓట్లను నమోదు చేసారని ఇలాంటి దొంగ ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆధారాలతో ఈసీకి అందించామన్నారు. ఎన్నికల కమీషన్ అధికారులు వచ్చి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించాలన్నారు. దీనికోసం ఈసీ ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులను పంపించాలని చంద్రబాబు కోరారు.