Rahul Gandhi Defamation case:పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కిందికోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై అప్పుడే తీర్పు చెప్పలేమని వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. మోడీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల సూరత్ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ రాహుల్ గుజరాత్ లోని సూరత్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆయన వెంట వచ్చారు.
ఏప్రిల్ 13న విచారణ..(Rahul Gandhi Defamation case)
సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ హాజరయ్యారు. భారీ భద్రత మధ్య అక్కడికి చేరుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్షను సస్పెండ్ చేయాలని అందులో కోరారు. అయితే, అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు స్పష్టం చేసింది. ఇక పరువునష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. దీనిపై ఏప్రిల్ 13న విచారణ చేపడతామని పేర్కొంది.
రెండేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కాగా, బెయిల్ లభించిన అనంతరం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను మిత్రకాల్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన ఆయుధం, మద్దతు సత్యమేనని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ.
మరోవైపు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ రోజు కూడా కోర్టులో ఊరట లభించలేదు. కోర్టు ఆయన జ్యూడిషియల్ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగించింది. విచారణ కీలక దశకు చేరుకుందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. కాగా సీనియర్ ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాను సీబీఐ లిక్కర్ స్కాంకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.
ఇవాళ కోర్టు విచారణ సందర్భంగా విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని.. ఒక వేళ బెయిల్ ఇస్తే అధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. దీంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. కాగా సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26నఅ రెస్టు చేసింది. సిసోడియా ఈ కుంభకోణానికి సంబంధించిన చాటింగ్‌ను డెలిట్ చేయడానికి ఆయన ఫోన్లనే ధ్వంసం చేశారని సీబీఐ కోర్టు తెలిపింది.చివరగా గత నెల 31వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. అప్పుడు కూడా ఈ స్కాంకు సంబంధించిన వారితో సిసోడియా చురుకుగా వ్యవహరించారని దానికి తగ్గ సాక్ష్యాలున్నాయని కోర్టు తెలిపింది. అప్పుడు కూడా కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది.