NOTA: రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్లు ,ఎన్నికల్లో ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది .దీనిపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత శివ్ ఖేరా సుప్రీంకోర్టు లో పిల్ వేశారు .ఎన్నికల్లో నోటా కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు . దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. శివ్ ఖేరా పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది.
శివ్ ఖేరా పిటిషన్..(NOTA)
నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్‌లో శివ్ ఖేరా పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను ‘కృత్రిమ అభ్యర్థి’గా భావించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు శివ్ ఖేరా చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్ట్ బెంచ్ ,దీనిపై తగిన వివరాలు అందించాలని ఈసీకి నోటీసులు జారీచేసింది . ఇది ఎన్నికల ప్రక్రియలో భాగమని, దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలని సుప్రీం కోర్ట్ ధర్మాసనం పేర్కొంది . ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌లో పోలింగ్ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును కూడా పిటిషన్ లో శివ్ ఖేరా ప్రస్తావించడం గమనించదగ్గ విషయం గా విశ్లేషకులు భావిస్తున్నారు .
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే ఓటరు ఏమి చేయాలనే ఆలోచన ఓటర్లలో కలిగింది .దీనితో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ సుప్రీమ్ కోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యంత వేసింది .దీని పై వాదనలు విన్న సుప్రీమ్ కోర్ట్ 2013లో ఈవీఎంలలో నోటా ఆప్షన్ కల్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది . సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే ‘నోటా’ అనే ఆప్షన్ కు ఓటేయవచ్చని ఆ సదుపాయాన్ని ఈవీఎం లో కల్పించారు . అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై స్పష్టమైన విధానం లేదు . ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.