Site icon Prime9

Delhi Air Pollution: ఢిల్లీ వాయుకాలుష్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Delhi air pollution

Delhi air pollution

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వంలో చలనం రావట్లేదు..(Delhi Air Pollution)

ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా అని ప్రశ్నించింది. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొంది. వాయు కాలుష్యంలో 24% గడ్డి కాల్చడం వల్లే ఉత్పన్నం అవుతోందని వెల్లడించింది.ప్రతి సంవత్సరం ఢిల్లీని కాలుష్య సమస్య వెంటాడుతూ ఉంది. మేం జోక్యం చేసుకుంటే కానీ ప్రభుత్వంలో చలనం రావట్లేదు. పంజాబ్, హరియాణాల్లో గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. గడ్డి కాల్చడం వల్ల 24 శాతం గాలి కలుషితం అవుతోంది. బొగ్గు, బుడిద వల్ల 17 శాతం, వాహనాల వల్ల 16 శాతం గాలి కలుషితమవుతోంది. ఇదంతా ఢిల్లీ ప్రభుత్వానికి తెలుసు. అయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు స్పందన కరువయింది. వాహనాల్లో సరి – బేసి విధానం అమలు చేయాలా వద్దా అన్నది మాపై వదిలేయకండి. ప్రజల ఆవేదనను దేవుడు గమనించాడేమో. నిన్న రాత్రి వర్షం కురిపించాడు. దీంతో కొంత ఉపశమనం లభించింది. ప్రభుత్వ చర్యలు మాత్రం ఏమీ లేవు. వరికి బదులుగా పంజాబ్, హరియాణా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ఇప్పుడు సరిబేసి విధానం అమలు చేస్తామని చెబుతున్నారు. దీని వల్ల ఏం ఉపయోగం. పని చేయకుండా కోర్టుపై ఆ భారాన్ని వదిలేసి.. కోర్టు ఆదేశాల వల్ల కాలుష్యం ఏర్పడిందని మీరు చెబుతారు” అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సరి – బేసి విధానాన్ని సుప్రీంకోర్టు సమీక్ష తరువాత అమల్లోకి తీసుకోస్తామని కేజ్రీవాల్ సర్కార్ చెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యాప్ ఆధారిత ట్యాక్సీలను నిషేధించాలని రవాణా శాఖను కోరినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాల రాకపోకల్ని నిషేధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Exit mobile version