Delhi girl killed: దేశరాజధాని ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఒక యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి బండరాయితో తలపై మోది చంపాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ హత్య సీసీటీవీలో రికార్డయింది. మృతురాలిని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీకి చెందిన సాక్షిగా గుర్తించారు.
యూపీలో అరెస్టయిన నిందితుడు..(Delhi girl killed)
నిందితుడు సాహిల్ ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్. సాక్షి అతనితో గత కొంతకాలంగా స్నేహంగా ఉంటోంది. రెండురోజులకిందట వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆదివారం తన స్నేహితురాలి కుమార్తె పుట్టినరోజు వేడుకుకు హాజరుకావాలని సాక్షి బయలు దేరింది. సాహిల్ ఆమెను వెంబడించి పలు మార్లు కత్తితో పొడిచి రాతితో తలపై మోదాడు. ఈ సంఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న నిందితుడు సాహిల్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుండి అరెస్టు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుపై షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ హత్యపై స్పందిస్తూ ట్విట్టర్‌లో ఢిల్లీలో ఒక మైనర్ బాలిక బహిరంగంగా దారుణంగా హత్య చేయబడింది. ఇది చాలా విచారకరం మరియు దురదృష్టకరం. నేరస్తులు నిర్భయంగా మారారు, పోలీసులంటే భయం లేదు. LG సార్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత, ఏదైనా చేయండి. ఢిల్లీ ప్రజల భద్రత అత్యంత ముఖ్యమైనది అంటూ రాసారు. మరోవైపు దేశ రాజధానిలో మహిళలకు అత్యంత భద్రత లేకుండా పోయిందని, ఈ దారుణ హత్యపై పోలీసులకు నోటీసులు జారీ చేశామని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు.