Southwest Monsoon: భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. అయితే వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కంటే 7 రోజులు ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. రానున్న 48 గంటల్లో కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా రుతుపవనాలు కదిలే అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. గంటకు 19 నాట్‌ల వేగంతో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్టు ఐఎండీ పేర్కొంది.
సాధారణంగా జూన్ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. అయితే వాతావరణ మార్పులు, తుపాను కదలికల కారణంగా వారం ఆలస్యంగా దేశంలోకి వచ్చాయి. గత ఏడాది మే 29న రుతు పవనాలు రాగా.. 2021లో జూన్ 3న , 2020 లో జూన్ 1న కేరళ తీరంలో ప్రవేశించాయి. ఈ సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఏప్రిల్‌లో వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపింది. అయితే, గురు, శుక్ర వారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.