West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది. త్వరలో ఎంపిక జరగనున్న ఆ ఒక్క రాజ్యసభ సీటు రేసులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి పేర్లను పరిశీలిస్తున్నట్లు భాజపా వర్గాల సమాచారం. ఈ సీటు కోసం అభ్యర్థుల జాబితాను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి వేర్వేరు జాబితాలను బీజేపీ అధిష్ఠాన వర్గానికి సమర్పించినట్టు సమాచారం.
మజుందార్ ప్రతిపాదించిన జాబితాలో రాజ్యసభ మాజీ సభ్యులు రూపా గంగూలీ, స్వపన్ దాస్‌గుప్తా, బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది, అనంత్ మహరాజ్ ఉన్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఇప్పటికే సౌరవ్ గంగూలీకి ఎంపీ నామినేషన్‌ను ఎనౌన్స్ చేసింది. కానీ సౌరవ్ నుంచి తక్షణ స్పందన అయితే రాలేదు. కాగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 18తో ముగియనున్నందున జూలై 24న ఎంపీ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
ఎవరెవరు పదవీ విరమణ(West Bengal)
అయితే రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న వారిలో డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందుశేఖ వంటి ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వారిలో ప్రదీప్ భట్టాచార్య కాంగ్రెస్ ఎంపీ. రాజ్యసభలో పోటీ చేయనున్న 10 స్థానాల్లో ప్రముఖ వ్యక్తుల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఉన్నట్టు సమాచారం.
మరోవైపు గుజరాత్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి పశ్చిమబెంగాల్ లో ఎంపీ ఎన్నికకు మొత్తం 43 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా 34 మంది ఎమ్మెల్యేల ఓట్లతో బీజేపీ ఒక్క సీటు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.