Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూర్ చేరుకున్నారు. రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభం కాగానే గురువారం ఉదయం ఆమె యాత్రలో పాల్గొంటారు.
చాలా కాలం తర్వాత సోనియా గాంధీ భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే పార్టీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనారోగ్య కారణాలతో ఆమె గత ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేయలేదు.ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీరంగపట్నం నుంచి కర్ణాటక పాదయాత్రను కొనసాగించి, సాయంత్రం పాండుపూర్ దగ్గర పాదయాత్రను ముగించనున్నారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఆయుధపూజ, దసరా సందర్భంగా పాదయాత్రను నిలిపివేయనున్నారు. అక్టోబర్ 6న ఆదిచూచనగిరి మఠంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించనుంది.
‘భారత్ జోడో యాత్ర’ ఈ ఉదయం మైసూర్‌లోని ఆర్-గేట్ సర్కిల్ నుండి ప్రారంభమై ఉదయం 9 గంటలకు మండ్య జిల్లాలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వేణుగోపాల్, సూర్జేవాలా, పలువురు కాంగ్రెస్ నేతలు యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల ప్రయాణంలో 26వ రోజుకు చేరుకుంది.