Sharad Pawar: రాజకీయ వ్యవస్థాపకుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక ప్రకటన వెల్లడించారు. ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ముంబైలో మంగళవారం జరిగిన తన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో శరద్ పవార్ తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే ఆయన నిర్ణయంపై ఎన్సీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. మరికొంతమంది కార్యకర్తలు శరద్ పవార్ నిర్ణయంతో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆయన నిర్ణయానికి కారణాలు వెల్లడించలేదు. అదే విధంగా పార్టీకి తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై కూడా స్పష్టత లేదు.
#WATCH | Supporters of NCP chief Sharad Pawar protest against his announcement to step down as the national president of NCP. pic.twitter.com/LsCV601EYs
— ANI (@ANI) May 2, 2023
కాగా, శరద్ పవార్ దగ్గరి బంధువు అజిత్ పవార్.. ఎన్సీపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంతో శరద్ పవార్ పార్టీ పగ్గాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగబోతున్న నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎంపీ గా ఉన్న ఆయన కుమార్తె సుప్రియా సూలే బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నా.. అజిత్ పవార్ ను దృష్టిలో పెట్టుకునే బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరో వైపు శరద్ పవార్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో పార్టీకి సంబంధించిన రెగ్యులర్ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాల కూటమి బాధ్యతలను తీసుకోవాలని పలు ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాలను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు.