New Delhi: ఇకపై కారులో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు కూడ సీటు బెల్ట్ ధరించాలి. లేకుంటే వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.
భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య 18-34 ఏళ్ల మధ్య వయస్కులేనని గడ్కరీ తెలిపారు. మరో మూడు రోజుల్లో ఎవరైనా కారులో వెనుక సీటుపై కూర్చొని సీటు బెల్ట్ ధరించకపోతే, అతనికి లేదా ఆమెకు జరిమానా విధించబడుతుందన్నారు.సైరస్ మిస్త్రీ యాక్సిడెంట్ కారణంగా, డ్రైవర్ సీటుకు ఉన్నట్లే వెనుక సీటులో సీటు బెల్ట్ కోసం అలారం ఉండాలని నిర్ణయించుకున్నానని గడ్కరీ అన్నారు. వెనుక సీట్ల కోసం సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్ రాబోయే రోజుల్లో కార్లు మరియు ఎస్ యువిలలో కూడా ప్రవేశపెట్టబడుతుందని పేర్కొన్నారు.
కార్ల హారన్‌లను భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనితో భర్తీ చేయడం ద్వారా దేశంలో పెరుగుతున్న ధ్వని కాలుష్య స్థాయిలను తగ్గించవచ్చని గడ్కరీ భావిస్తున్నారు. “ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి, కార్ల హారన్ల ధ్వనిని భారతీయ వాయిద్యాల ధ్వనితో భర్తీ చేయాలనేది నా ఆలోచన” అని గడ్కరీ తెలిపారు. దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని, డీజిల్ బస్సును కిలోమీటరుకు రూ. 150గా నడపాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి ఏసీ బస్సుకు కిలోమీటరుకు రూ. 80 మరియు నాన్ ఏసీ బస్సుకు కిలోమీటరుకు రూ. 49 ఖర్చవుతుందని గడ్కరీ తెలిపారు.