Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
సచిన్ చివరి మ్యాచులు ఇక్కడే..(Sachin Tendulkar)
సచిన్ టెండూల్కర్ యొక్క అద్భుతమైన కెరీర్ మరియు భారత క్రికెట్‌కు చేసిన కృషికి గుర్తుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. 22 అడుగుల ఎత్తు గల ఈ విగ్రహాన్ని అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు-శిల్పి ప్రమోద్ కాంబ్లే రూపొందించారు. టెండూల్కర్ తన ఐకానిక్ క్రికెట్ స్ట్రోక్‌లలో ఒకదానిని ఆడే రూపంలో ఇది ఉంది. స్టేడియం లోపల సచిన్ టెండూల్కర్ స్టాండ్‌కు ఆనుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.సచిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను వాంఖడే స్టేడియంలో నవంబర్ 2013లో ఆడారు. ఈ మ్యాచ్ లో సచిన్ 118 బంతుల్లో 74 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా టెండూల్కర్ యొక్క చివరి ప్రపంచ కప్ ఆట శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఇక్కడే జరిగింది. ముంబై స్దానికుడయిన సచిన్ కు వాఖండే స్టేడియంతో ఉన్న అనుబంధం దృష్ట్యా కూడా ఈ విగ్రహం ఆవిష్కరణ ప్రత్యేకమైనది.
ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ దంపతులు,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ కార్యదర్శి జే షా, కోశాధికారి ఆశిష్ షెలార్, ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అభిమానులు సచిన్ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.