Rajasthan Assembly Elections: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు. నాథ్‌ద్వారా నుంచి సీపీ జోషి, ఓసియన్ నుంచి దివ్య మడెర్న, లక్ష్మణ్‌గఢ్ నుంచి గోవింద్ సింగ్ డోటసర, సాదుల్‌పూర్ నుంచి కృష్ణ పునియా బరిలో ఉన్నారు.
శుక్రవారం, దౌసాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ముఖ్యమంత్రి గెహ్లాట్, జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఓటు వేయాలని ప్రజలను కోరారు.తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కూడా గుర్తు చేసారు. ప్రభుత్వ పనితీరుపైనే ఎన్నికల పోరాటం జరుగుతుందని చెప్పారు.దౌసాలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో వాటిలో నాలుగు కాంగ్రెస్‌కు, ఒకటి స్వతంత్ర ఎమ్మెల్యే హడ్లాకు దక్కాయి.రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదిలా ఉండగా శనివారంనాడే 83 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 200 మంది సభ్యుల అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని నవంబర్ 25వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.