Rahul Gandhi in Assam: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
కేంద్రం సాయం అందేలా చేయండి.. (Rahul Gandhi in Assam)
ఫులెర్తాల్‌లోని సహాయ శిబిరాన్ని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్‌కు వెళ్లి మూడు వేర్వేరు ప్రాంతాల్లోని సహాయ శిబిరాలను సందర్శించారు. ఈ రోజు సాయంత్రం ఆయన మణిపూర్ గవర్నర్‌ను, ప్రతిపక్ష నేత కూడా కలవనున్నారు. అస్సాంలో వరదల ధాటికి 58 మంది మరణించగా 53,429 మంది రాష్ట్రవ్యాప్తంగా షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. 3,535 గ్రామాల్లో ఇప్పటివరకు 23.9 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 68,769 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.కజిరంగా నేషనల్ పార్క్‌లో 6 ఖడ్గమృగాలు సహా 114 జంతువులు చనిపోయాయి. మరోవైపు అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) సోమవారం సిల్చార్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి రాష్ట్రంలో ప్రస్తుత వరదల పరిస్థితిపై లేఖను సమర్పించింది.వరదల కారణంగా సంభవించిన తీవ్ర నష్టాలకు కేంద్రం నుండి పరిహారం అందేలా సహాయం చేయాలని అసోం ప్రజల తరపున వారు రాహుల్ గాంధీని లేఖలో అభ్యర్థించారు.