Site icon Prime9

Pre Installed Apps: స్మార్ట్ ఫోన్లపై కొత్త రూల్స్ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

Pre Installed Apps

Pre Installed Apps

Pre Installed Apps: స్మార్ట్‌ఫోన్ల ద్వారా స్పై, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. స్మార్ట్‌ఫోన్లలో ఇన్ బిల్ట్ యాప్‌లను తొలగించేలా కంపెనీలకు ఆదేశాలిచ్చేందకు ప్రణాళిక రచిస్తోంది.

 

అదే విధంగా మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్ డేట్స్ ను తప్పనిసరిగా టెస్ట్ చేసేందుకు అవకాశం ఉండేలా కూడా ప్రయత్నిస్తోంది.

ఈ కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.

ఇదే జరిగితే ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌ల ద్వారా లబ్ధిపొందుతున్న శాంసంగ్‌, రెడ్‌మీ, వివో, యాపిల్‌, షావోమీ లాంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల వ్యాపారం దెబ్బ తింటుంది.

ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంచుతున్న యాప్‌లే భద్రతాపరంగా ముప్పు తెచ్చిపెడుతున్నట్లు గుర్తించినట్టు ఓ అధికారి తెలిపారు.

దీన్ని చైనా లాంటి దేశాలు దుర్వినియోగపర్చి దేశ భద్రతకు భంగం కలిగించకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

 

ఇప్పటికే 300 కు పైగా యాప్‌ల నిషేదం(Pre Installed Apps)

2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వ్యాపారాలపై భారత్‌ నిఘా పెంచిన విషయం తెలిసిందే.

ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 300 కు పైగా చైనా యాప్‌లను నిషేధించింది.

అలాగే చైనా సంస్థలు భారత్‌లో చేస్తున్న పెట్టుబడులపైనా ముమ్మర తనిఖీలను ముమ్మరం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగానూ వివిధ దేశాలు చైనా తీసుకొస్తున్న టెక్నాలజీపై ఆంక్షలు విధిస్తున్నాయి.

హువావే, హిక్‌విజన్‌ లాంటి సంస్థల పరికరాలపై నిషేధం విధించాయి.

వాటిని చైనా గూఢచర్యానికి వాడుకుంటోందనే అనుమానంతోనే ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి.

అయితే తాము గూఢచర్యానికి పాల్పడటం లేదని చైనా చెప్తోంది.

 

ప్రతి అప్‌డేట్‌కు ముందస్తు తనిఖీ

ప్రపంచంలోని సార్ట్ ఫోన్ల మార్కెట్లలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్‌ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్‌లు ఉంటున్నాయి.

వీటిని డిలీట్‌ చేయడానికి వీలు లేదు. షావోమీ యాప్‌ స్టోర్‌ గెట్‌యాప్స్‌, శాంసంగ్‌ పేమెంట్‌ యాప్‌ శాంసంగ్‌ పే, ఐఫోన్‌లో సఫారీ బ్రౌజర్‌.. వీటిని ఫోన్‌ నుంచి తొలగించడం సాధ్యం కాదు.

కొత్తగా రూపొందిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆయా కంపెనీలు తమ ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను తొలగించే ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నిబంధనల్ని కంపెనీలు పాటిస్తున్నాయో, లేదో అనేది బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది.

మరోవైపు ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఇచ్చే ప్రతి అప్‌డేట్‌కు ముందస్తు తనిఖీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

కస్టమర్లకు అప్‌డేట్‌ను అందించే ముందే ఈ తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.

 

కంపెనీల రియాక్షన్ ఏంటో

అయితే, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే శాంసంగ్, షియోమీ, వివో, యాపిల్ లాంటి కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత సమయం పడుతుంది.

అంతే కాకుండా వీటిలోని ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ వల్ల వ్యాపార నష్టాలు కూడా ఉంటాయి. మరి ప్రభుత్వ నిబంధనలపై కంపెనీ లు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

 

Exit mobile version