PM Narendra Modi Says Maha Kumbh Mela Is A Symbol Of Unity In Diversity: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్నిప్రాంతాలు, వర్గాల ప్రజలను ఈ ఆధ్యాత్మిక వేడుక.. ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. పలు దేశాల వారు సైతం ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ఆదివారం నాటి 118వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ రిపబ్లిక్ డే ప్రత్యేకం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి వచ్చే రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైనదని, ఈ ఏడాదితో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని గుర్తుచేశారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ తలవంచి నమస్కరిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఎన్నికల ప్రక్రియ పటిష్ఠం..
అలాగే, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం పాత్రను మోదీ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు అందివస్తున్న టెక్నాలజీ సాయంతో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించటంలో ఈసీ చూపుతున్న చొరవను ప్రధాని మోదీ కొనియాడారు.
అభివృద్ధిలో మహిళల పాత్ర..
దేశంలోని యువత అంకుర సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. నేటి యువత తమ అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్లడించారు. దీపక్ నబం అనే వ్యక్తి తాను స్థాపించిన అంకుర సంస్థ ద్వారా నిరాశ్రయులకు సహాయం చేస్తున్నాడని ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. డిజిటల్ యుగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు.
మూలాలు మరువొద్దు..
కుంభమేళాకు పెద్దసంఖ్యలో వస్తున్న యువతను అభినందించారు. యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మూలాలు బలపడతాయన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.