PM Modi in Bihar:ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.
మైనారిటీలకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ..(PM Modi in Bihar)
రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ కమ్యూనిటీల రిజర్వేషన్లు రద్దు కాకుండా చూస్తానని మోదీ హామీ ఇచ్చారు. కాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్‌సీ/ఎస్‌టి/ ఓబీసీ కూటమి రిజర్వేషన్లలో కోత విధించి ఆ కోటాను ముస్లింలకు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే వారి ఆటలు సాగనివ్వమని ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని.. అధికారంలోకి వస్తే మైనారిటీలకు అనుకూలంగా రాజ్యాంగం సవరిస్తుందన్నారు మోదీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేలాది ఇన్సిస్టిట్యూషన్స్‌లను మైనార్టీ ఇన్సిస్టిట్యూషన్స్‌గా ప్రకటిస్తుందన్నారు ప్రధాని.. ఇంతకు ముందు ఈ ఇన్సిస్టిట్యూషన్స్‌లో ఎస్‌సీ/ఎస్‌టి, ఓబీసీలకు అడ్మిషన్‌లో రిజర్వేషన్లు దక్కేవన్నారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీలు మతపాత్రిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనలో ఉన్నాయన్నారు. కాగా భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ.. విద్యాసంస్థల్లో కానీ రిజర్వేషన్లు నిషేధించారని ప్రధాని గుర్తు చేశారు.
అంబేద్కర్ కూడా చెప్పారు..
భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవని స్పష్టం చేశారు. అదే ఆర్జేడీ,కాంగ్రెస్‌లు మాత్రం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనలో ఉన్నాయన్నారు. పనిలో పనిగా ప్రధాని లాలూ యాదవ్ కు చెందిన ఆర్‌జెడీ ఎన్నికల గుర్తుపై చురకలంటిచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బులతో ధగధగ లాడిపోతుంటే.. బిహార్‌లో మాత్రం లాంతర్లతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లాలూ లాంతర్ కేవలం ఒక ఇంటికి మాత్రమే వెలుగునిస్తుంది రాష్ర్టం మొత్తం అంధకారమేనని మోదీ చురకలంటించారు.
గత నెల ప్రధానమంత్రి మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద .. మహిళల మంగళసూత్రాలను సైతం లాక్కొని ఎక్కువ పిల్లలున్న మైనార్టీలకు పంచుతుందన్నారు. తర్వాత ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు. తాను ఈ వ్యాఖ్యలు ముస్లిం కమ్యూనిటిని ఉద్దేశించి అనలేదని.. హిందూ- ముస్లిం రాజకీయాలకు తాను తావు ఇవ్వనన్నారు. ఇక రాజకీయ పండితులు, ప్రశాంత్ కిశర్, యోగేంద్ర యాదవ్‌లు లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. ప్రధానిగా మూడో సారి మోదీ పగ్గాలు చేపడతారని బలంగా చెబతున్నారు.