RK’s wife Sirisha: దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీషని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని టంగుటూరు మండలం ఆలకూరుపాడులో నివసిస్తున్న ఆర్కే భార్య శిరీష నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రంపూట శిరీషని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై తాజాగా ఎన్ఐఎ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత ఆర్కే డైరీ ఆధారంగానే శిరీషని, మరో మావోయిస్టు సానుభూతిపరుడు దుడ్డు ప్రభాకర్‌ని అరెస్ట్ చేశామని ఎన్ఐఎ ప్రకటించింది.
ఇద్దరూ మావోయిస్టులకోసం పనిచేస్తున్నారు..(RK’s wife Sirisha)
దుడ్డు ప్రభాకర్, శిరీష ఇద్దరూ మావోయిస్టులకోసం పని చేస్తున్నారని ఎన్ఐఎ తెలిపింది. ఇద్దరూ 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని ఎన్ఐఎ వెల్లడించింది. ఇద్దరికీ మావోయిస్టులనుంచి నిధులు అందుతున్నాయని గుర్తించామని ఎన్ఐఎ పేర్కొంది. ఇద్దరూ మావోయిస్టులకోసం రిక్రూట్‌మెంట్ కూడా చేస్తున్నారని ఎన్ఐఎ చెబుతోంది. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని అంటున్న ఎన్ఐఎ ఇద్దరినీ అరెస్ట్ చేశామని ప్రకటన జారీ చేసింది.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వీరిని అరెస్ట్ చేయడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి, ఈ విషయం పై ప్రజాసంఘాల నాయకుడు ఆర్కే బావ కల్యాణ్ రావ్ మీడియాతో మాట్లాడారు. ఎటువంటి ముందస్తు నోటీస్ లు లేకుండా ఓక మనిషిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధంఅని ప్రజల హక్కులను చేతిలోకి తీసుకొనే హాక్కు ఎవరికి లేదన్నారు. కేవలం కక్ష పూరితంగానే ఈ అధికారులు ఇటువంటి అరెస్ట్ లు చేస్తున్నారని ఆరోపించారు.