Modi 3.0 government: లోక్ సభలో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ … ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు. ఎన్‌డీఏ కూటమి మొత్తం 22 రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుస్తుందన్నారు. లోకసభలో ఎన్‌డీఏ నాయకుడిగా నరేంద్రమోదీని రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. ఎన్‌డీఏ నాయకులు మద్దతు పలికారు. కాగా మోదీ ఎన్‌డీఏ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎన్‌డీఏ కూటమి కలసికట్టుగా పనిచేస్తుందన్నారు మోదీ.
ఈ నెల 9వ తేదీ ఆదివారం ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియపై లేని పోని అనుమానాలు లేవనెత్తుతున్నారన్నారు. దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి కట్ర చేస్తోందని ఆరోపించారు. వచ్చే పది సంవత్సరాల పాటు ఎన్‌డీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. దేశాన్ని మరింత అభివృద్ది పథంలో తీసుకుపోతామన్నారు. తమ ప్రధాన ఎజెండా పేదలు, మధ్య తరగతి వారి అభివృద్దికే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇండియా ఆర్థికంగా దూసుకుపోవడానికి ప్రధాన కారణం దేశంలోని మధ్య తరగతి ప్రజలేనని ఆయన అన్నారు. దేశ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు నాణ్యమైన జీవితాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు.
పవన్ కాదు తుఫాన్..(Modi 3.0 government)
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కూటమి విజయంలో పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పవన్ వ్యక్తి కాదు.. ఓ తుఫాన్ అని కొనియాడారు. పవన్ వల్లే ఏపీలో విజయం లభించింది మోదీ చెప్పారు. చంద్రబాబుతో కలిసి అఖండ విజయం సాధించామన్నారు. ఏపీ విజయం సామాన్యుని ఆకాంక్షకు నిదర్శనని ప్రధాని మోదీ చెప్పారు.దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎన్‌డీఏకు ఓటు వేశారు. వివిధ పార్టీలతో పెట్టుకొన్న పొత్తును బట్టి చూస్తే భారతీయ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత విజయవంతమైన పొత్తు ఎప్పుడూ లేదన్నారు. నిర్ణయాలన్నీ ఎన్‌డీఐ నాయకులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు మోదీ. ఎన్‌డీఏ సమావేశంలోఆయన మాట్లాడుతూ.. తన జీవితం మాతృభూమి ఇండియాకే అంకితమన్నారు. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు క్యూ కట్టి లక్ష రూపాయలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను వెర్రివాళ్లను చేసి తప్పుడు హామీలను ఇస్తోందని మోదీ మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా ఆలోచించాలని సూచించారు. గత పది సంవత్సరాల నుంచి చూసింది కేవలం ట్రైలర్‌మాత్రమే అసలు సినిమా ముందుందన్నారు మోదీ. గెలిచినా.. ఓడినా తాము ఒకే విధంగా ఉంటామని, గెలిచామని ఎదుటి పక్షాన్ని అగౌరవపర్చమన్నారు.