Site icon Prime9

Madhya Pradesh Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అమిత్ షా సభ నుంచి తిరిగి వెళ్తూ

madhya-pradesh-road-accident leads to 12 death and 39 injured

madhya-pradesh-road-accident leads to 12 death and 39 injured

Madhya Pradesh Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. వీరంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బాధితులను సమీపంలోని రేవా, సిద్ధి ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాద విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి.. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాద సమయం లోనే ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, రేవా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరో నలుగురు మరణించారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. మరో 39 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

షబ్రీ జయంతి సందర్భంగా.. సాత్నాలో నిర్వహించిన మహాకుంభ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభకు మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ కూడా హాజరయ్యారు. ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలు సాయంత్రం 5గంటలకు తిరిగి సిద్ధికి  బస్సుల ద్వారా బయలుదేరారు. అయితే మొహానియా వద్ద బస్సులను రోడ్డు పక్కన నిలిపి అల్పాహారం సేవిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు..  బస్సులను ఢీకొట్టింది. దీంతో ముందున్న బస్సు.. పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు విషయాన్ని చెప్పి.. సహాయక చర్యలు చేపట్టారు.

కాగా ఈ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో..  సిద్దిలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. భగవంతుడు వారికి ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని.. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అమిత్ షా రాసుకొచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విషాద ఘటన పట్ల స్పందిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version