Khushbu Sundar : సీనియర్ నటి కుష్బూ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఖుష్బూ. అయితే తమిళనాడులో ఒకప్పుడు ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టారు అంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖుష్బూ జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు కుష్బూ. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా తాజాగా ఖుష్బూకు అరుదైన గౌరవం దక్కింది. కేరళలోని త్రిసూర్‌లోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ఏటా ఒకసారి నారీపూజ నిర్వహిస్తుంటారు. దీనిలో పాల్గొనే మహిళను ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. ఈ ఏడాది పూజలో పాల్గొనే అవకాశం నటి ఖుష్బూకు లభించింది. దీంతో ఇటీవల ఆమె విష్ణుమాయ దేవాలయంలో నిర్వహించిన నారీ పూజలో పాల్గొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో .. ఏటా ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు. అలానే ఆ భగవంతుడి విశేష ఆశీస్సులు పొందాను. నారీపూజలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కేవలం ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పూజలో పాల్గొనే వ్యక్తిని సాక్షాత్తూ ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. మనందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నా. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషం, శాంతితో జీవించాలని కోరుకున్నా అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.