Kejriwal Fires on Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు. హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ఆమ్‌ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని కంకంణం కట్టుకున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. తన పార్టీని నామరూపాయాలు లేకుండా చేయడంతో పాటు పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులను జైలుకు పంపించారన్నారు.
బీజేపీ ఎజెండా వన్ నేషన్.. వన్ లీడర్..(Kejriwal Fires on Modi)
ప్రధాని మోదీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షపార్టీ నాయకులను జై ల్లో వేస్తారని కేజ్రీవాల్ అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని ఒకటే సందేశం ఇవ్వాలనుకున్నారు. ఒక వేళ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింతే.. దేశంలో ఎవరినైనా జైలుకు పంపవచ్చుననేదే ఆయన ఉద్దేశమన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎజెండా ఒక్కటే ‘వన్ నేషన్.. వన్ లీడర్” అని కేజ్రీవాల్ అన్నారు. కాగా కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నాయకుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఇక కేజ్రీవాల్ ఈ రోజు నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. అటు తర్వాత ఆప్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఉధృతంగా ప్రచారం చేయనున్నారు.
ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడం పట్ల ప్రతిపక్ష నాయకులు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తామని.. ప్రస్తుతం ఇండియా కూటమిలో కేజ్రీవాల్ హోదా మరింత పెరుగుతుందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరబ్ భరద్వాజ్ అన్నారు. కేజ్రీవాల్ ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా తిరిగి లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను బీజేపీ తేలికగా తీసుకుంది. ఇది కేవలం తాత్కాలికమేనని, దిల్లీ లిక్కర్‌పాలసీ కేసు విచారణలో భాగంగా ఆయన అవసరం ఉంది కాబట్టి కేజ్రీవాల్‌ను ఈడీ తమ అదుపులోకి తీసుకుందని బీజేపీ వాదిస్తోంది.