Karnataka Elections: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ.. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలోని అసంతృప్త నేతలు పక్క పార్టీల వైపు తొంగిచూస్తున్నారు. తాజాగా కర్గాటకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సవాడి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో ఆయన హస్తం పార్టీ చేరారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. కాంగ్రెస్ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
కాగా, లక్ష్మణ్ సవాడి అథని నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వీరవిధేయుడుగా పేరు తెచ్చుకున్నాడు సవాడి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్‌ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి నేతల చేరికల విషయంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు.
కర్ణాటకలో అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను ఎంచుకుని వారికే టికెట్స్ ఇస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. అందులో 52 కొత్త ముఖాలకు చోటు ఇచ్చారు. సిట్టింగ్‌లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీ సీనియర్లు సైతం టికెట్ల కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారు.