కేజీఎఫ్ : మళ్ళీ తెరుచుకోనున్న “కేజీఎఫ్”… అసలు కేజీఎఫ్ లో బంగారం తవ్వకాలు ఎప్పుడు? ఎందుకు ? ఆపేశారంటే?

కేజీఎఫ్... అనగానే అందరికీ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ

  • Written By:
  • Updated On - December 19, 2022 / 04:33 PM IST

KGF : కేజీఎఫ్… అనగానే అందరికీ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కన్నడ నాట్య కేజీఎఫ్ కి ముందు కేజీఎఫ్ తర్వాత అని కూడా అనేలా పరిస్థితులను మార్చేసింది ఈ చిత్రం. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1200 కోట్లు వసూలు చేసింది. ఒక్క బాలీవుడ్‌ లోనే దాదాపు 430 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది ఈ చిత్రం. అయితే ఈ తరుణంలోనే కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అసలు నిజమైన కేజీఎఫ్ ఎక్కడ ఉంది. ఆ ప్రాంతంలో నిజంగా బంగారం తవ్వకాలు జరిగాయ అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. కొంతమంది అయితే ఏకంగా ఆ చోటుకి వెళ్ళి వీడియోలు కూడా చేశారు. వాటన్నింటినీ మనం యూట్యూబ్, సోషల్ మీడియాలో గమనించవచ్చు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కేజీఎఫ్ ను మళ్ళీ ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ విషయం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలోనే కేజీఎఫ్ ఎక్కడ ఉంది ? కేజీఎఫ్ లో బంగారం తవ్వకాలు ఎప్పుడు జరిగాయి ? ఎందుకు ఆపేశారు? ఎప్పుడు ఆపేశారు వంటి వివరాలు మీకోసం ప్రత్యేకంగా… కేజీయఫ్‌ అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. కోలార్‌ నగరానికి 30 కిలోమీటర్లు, బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఉన్నాయి.

బంగారం తవ్వకాలు ఎప్పుడు జరిగాయి అంటే?

టిప్పు సుల్తాన్‌ కన్నుమూసిన తర్వాత మైసూర్‌ ప్రాంతం బ్రిటిష్‌ వారి వశమైంది. అదే సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జాన్‌ వారెన్‌ కోలార్‌ మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ఓ పుసక్తం లోనూ రాసుకొచ్చారు. బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్థుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఎక్కువ మొత్తంలో మట్టిని సేకరించి పరిశీలించగా… అందులో అతి తక్కువ మొత్తంలో బంగారం ఉందని, ఇది ఒక వృథా ప్రయత్నమేనని భావించి మధ్యలోనే తన మిషన్‌ని నిలిపివేశాడు. 1850 తర్వాత లావెల్లీ అనే ఓ బ్రిటిష్‌ అధికారి… వారెన్‌ రాసిన పుస్తకాన్ని చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి 1871లో మైసూర్‌ రాజుకు కోలార్‌ ప్రాంతాన్ని లీజుకు ఇవ్వమని ఓ లేఖ రాసి ఆమోదం పొందారు.

ఆ తర్వాత బంగారం వెలికితీత వల్ల వచ్చే ఆదాయం కంటే కార్మికులకు చెల్లించే వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నష్టాలతో నడుపలేమని తెలిసిన అతను… ఆ హక్కులను ఓ కంపెనీకి అమ్మేశాడు. అయితే ఈ కంపెనీ మాత్రం పెద్ద పెద్ద యంత్రాలతో పనులు చేపట్టి ఎక్కువ లాభాలు గడించింది. దాంతో అక్కడికి ఎంతో మంది బ్రిటీష్‌ అధికారులు వచ్చి స్థిరపడిపోయారు. అక్కడ కేజీఎఫ్‌ అనే టౌన్‌షిప్‌ కూడా ఏర్పడింది. దీంతో అక్కడ కావేరి నదిపైన హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. దాదాపు 150 కిలో మీటర్ల మేర విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేయగా… అప్పటికి (1901-02) అదే అతిపెద్ద లైన్‌. అయితే ఆసియాలో అప్పటికీ రెండే దేశాల్లో విద్యుత్‌ ఉండేది. జపాన్‌లో అప్పటికే విద్యుత్ ఉండగా భారత్‌లో కోలార్‌ ప్రాంతంలో ఉండేది. అప్పట్లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 95శాతం కేజీఎఫ్‌ నుంచే ఉత్పత్తి అయ్యేదట.

బంగారం తవ్వకాలు ఎప్పుడు ఆపేశారు అంటే?

అయితే కాలక్రమంలో కోలార్‌లో నిల్వలు తగ్గడంతో దాని ప్రాబల్యం తగ్గిపోయి 0.7 శాతానికి పడిపోవడంతో భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌… 2001లో కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ప్రపంచంలోనే రెండో లోతైన బంగారు గని. 18 వేల అడుగుల లోతులో దాదాపు 121 ఏళ్ల పాటు ఈ బంగారం తవ్వకాలు జరిపారు. కేజీఎఫ్ సినిమా కంటే ముందే ఆ ప్రాంతంలో చాలా సినిమా షూటింగులు జరిగినా కేజీఎఫ్ తరువాతే ఆ ప్రాంతానిక క్రేజ్ వచ్చింది. అయితే కేజీఎఫ్‌లో ఇంకా విశాలమైన బంగ్లాలు, పోస్టాఫీసులు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, క్లబ్‌ హౌస్‌లు 150 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్‌గానూ మారుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ బంగారం తవ్వకాలకు ప్లాన్ చేస్తుందనే వార్త బయటికి రావడంతో దేశ వ్యాప్తంగా ఈ విషయంపై ఆసక్తి నెలకొంది.