Adhir Ranjan Chaudhary:ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ లా కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా బెనర్జీకి.. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వనని.. తన పార్టీ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందని మమత దీదీ తెగేసి చెప్పింది. కావాలంటే ఒకటో లేదా రెండు సీట్లు ఇస్తామని ఏదో ముష్టి వేస్తామని ఎద్దేవా చేశారు. దీంతో మమత.. అధిర్ మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఎన్నికలు సమీపించే కొద్ది ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు కూడా అయిన అదిర్ రంజన్ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేసే బదులు బీజేపీకి వేయడమే మేలని అన్నారు.
సెక్యులరిజం ప్రమాదంలో పడుతుంది..(Adhir Ranjan Chaudhary)
ఇక అధిర్ రంజన్ బహిరంగ సభ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇచ్చుకుంది. 2019తో పోల్చుకుంటే ఈ సారి బీజేపీ తక్కువ సీట్లు వస్తాయని చెప్పింది. ముర్షీదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీపీఎం మాజీ ఎంపీ ఎండీ సలీం పాల్గొన్నారు. ఈ సభలో అధీర్ మాట్లాడుతూ.. మోదీ చెప్పినట్లు అబ్ కీ బార్ 400 పార్ జరిగే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ చేతి నుంచి ఇప్పటికే వంద సీట్లు చేజారిపోయాయి. కాబట్టి కాంగ్రెస్.. సీపీఐ (ఎం) గెలవాల్సిందే. ఒకవేళ కాంగ్రెస్, సీపీఐ (ఎం) గెలవలేకపోతే.. సెక్యులరిజం ప్రమాదంలో పడుతుంది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే టీఎంసీకి ఓటు వేసే బదులు బీజేపీకి ఓటు వేయడే మేలని అన్నారు. ఓట్ ఫర్ కాంగ్రెస్, నాట్ ఫర్ టీఎంసీ, ఆర్ బీజేపీ అని అధిర్ అన్నారు.
అధిర్ రంజన్ వీడియో వైరల్ అయిన తర్వాత బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విరచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా పక్కాగా తెలుసు.. టీఎంసీకి ఓటు వేస్తే పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడు అధిర్ కూడా టీఎంసీ గెలిస్తే జరిగే ప్రమాదాన్ని గుర్తించారని అన్నారు. టీఎంసీ అధికారంలోకి వస్తే.. అవినీతి, మాఫియా, టెర్రరిస్టు, రేపిస్టులు.. షజహాన్ షేక్ లాంటి వారు రెచ్చిపోతారని బీజేపీ నాయకుడు హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందిస్తూ.. వీడియోను తాను చూడలేదన్నారు. ఆయన ఏ సందర్బంలో ఈ వ్యాఖ్య చేశారో తనకు తెలియదన్నారు జైరాం రమేశ్. 2019 వచ్చిన సీట్ల కంటే బీజేపీకి ఇంక తక్కువ సీట్లు వస్తాయని ఆయన కూడా జోస్యం చెప్పారు.