Site icon Prime9

Aditya L1: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. లగ్రాంజ్ పాయింట్ కు ఆదిత్య ఎల్- 1

Aditya L1

Aditya L1

 Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్‌ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు తన సేవలును అందించనుంది.

సూర్యుడిపై పరిశోధనకు..( Aditya L1)

కాగా గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్‌-1 పాయింట్‌లోకి ప్రవేశించింది. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్‌ 1 లక్ష్యం. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.

ఆదిత్య ఎల్‌-1 మిషన​ సక్సెస్‌పై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్‌ 1 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ట్వీట్‌ చేశారు. ఆదిల్య ఎల్‌-1 మిషన్‌ సంపూర్ణ విజయం సాధించినట్లు తెలిపారు.

Exit mobile version