New Delhi: అమెరికా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్‌లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.
అంతేకాదు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులలో 20 శాతం మంది భారతీయులేనని ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో వున్న యూఎస్ కాన్సులేట్లు ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఈ వీసాలను జారీ చేశాయని అమెరికన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఇటీవల కీలక ప్రకటన చేసింది. 2023 ఆర్ధిక సంవత్సరానికి గాను అమెరికా కాంగ్రెస్ అనుమతించిన 65,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. దీనితో పాటు అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు కింద జారీ చేసే 20,000 హెచ్ 1 బీ వీసాలకు సరిపడినన్ని దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.