Heavy Rains In Pakisthan : పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల కారణంగా పాకిస్తాన్‌లోని ఉత్తర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరీ ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని 4 జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి తైమూర్ అలీ ఖాన్ తెలిపారు.
బన్నూ జిల్లాలో 15 మంది మృతి చెందగా వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు ఉన్నారు. వారి వయస్సు 2 నుండి 11 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 140 మంది తీవ్రంగా గాయపడగా.. 200 కంటే ఎక్కువ జంతువులు మరణించాయి. ఈ నాలుగు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని చోట్లా రెస్క్యూ టీమ్‌లను మోహరించారు. ఈ తుఫాను భారత్‌పై కూడా ప్రభావం చూపనుంది. అదే విధంగా ఈ వారంలో 100 కి.మీ వేగంతో గాలులు, బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. మత్స్యకారులు జూన్ 17 వరకు సముద్రంలోకి వెళ్లకుండా నిషేధం విధించారు.