Kerala: కేరళలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, పినరయి విజయన్ సర్కారు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్, సర్కారుకు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. బాలగోపాల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని అర్థం వచ్చేలా సీఎం విజయన్‌కు గవర్నర్ లేఖ రాశారు. ఆర్థిక మంత్రి పట్ల తాను విశ్వాసం కోల్పోయాయని అందులో పేర్కొన్నారు. ఆ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు కేరళ సీఎం విజయన్.
ఈ నెల 18న యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్థిక మంత్రి కె.బాలగోపాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన వారు కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని సీఎంకు రాసిన లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తన విశ్వాసం కోల్పోయారని లేఖలో తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. గవర్నర్ లేఖ పై ముఖ్యమంత్రి పినరయి విజయన్ బదులిచ్చారు. మంత్రి పై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి పై తనకు ‘అచంచలమైన విశ్వాసం’ ఉందని విజయన్ గవర్నర్ లేఖకు బదులిచ్చారు.
కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకం విషయంలో రాజ్‌భవన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, వీరి నియామకాలు యూజీసీ నిబంధలనలకు అనుగుణంగా లేవన్నది ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ వాదన. ఈ క్రమంలోనే వీసీలు సోమవారం ఉదయానికల్లా తనకు రాజీనామాలు సమర్పించాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వీసీల నుంచి స్పందన లేకపోవడం చూసి గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ హోదాల్లో కొనసాగేందుకు వీసీలకున్న చట్టబద్ధమైన హక్కును అందులో ప్రశ్నించారు. నవంబరు 3వ తేదీలోపు బదులివ్వాలని నోటీసుల్లో సూచించారు. గవర్నర్ వైఖరి పై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని పేర్కొన్నారు.