West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు చెలరేగుతున్నాయి.. అక్కడి పరిస్థితి ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లుగా తయారయ్యిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ ప్రారంభమైన రోజు నుంచే అధికార, విపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లు ఎంతలా తయారయ్యాయి అంటే నడిరోడ్లపైనే కత్తులు, బాంబులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకునేలా మారాయి. కాగా ఎన్నికల ప్రచారం ముగిసి రెండు రోజులవుతుంది. హమయ్య గత రెండు రోజులుగా వాతావరణం కాస్త కుదుటపడిందని అనుకునేలోపే.. శనివారం పోలింగ్ ప్రారంభం కాకముందే రాష్ట్రంలో మరోమారు అల్లర్లు ప్రారంభమయ్యాయి.
ఎన్నికలకు ముందే అల్లర్లు(West Bengal)
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన అల్లర్లు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కపస్దంగ ప్రాంతంలో బాబర్ అలీ అనే టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. ఇక రెజినగర్ ప్రాంతంలో బాంబు దాడి జరగడంతో ఒక కార్యకర్త మృతి చెందాడు. ఖరగ్రాం ప్రాంతంలో ఒక టీఎంసీ కార్యకర్తను కత్తితో పొడిచి చంపారు. ఇక రాంపూర్ ప్రాంతంలో గణేష్ సర్కార్ అనే టీఎంసీ కార్యకర్తను పొడిచి చంపారు. ఇక నదియా జిల్లాలో జరిగిన హింసలో మరికొందరు టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ, భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 22 జిల్లా కౌన్సిళ్లు, 9,730 బ్లాక్ కౌన్సిళ్లు, 63,229 గ్రామాల్లో జరుగుతున్న పోలింగులో 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జులై 11వతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.