Site icon Prime9

Sunder Sham Arora: రూ. 50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ పంజాబ్ మాజీ మంత్రి

Sunder-Sham-Arora

Sunder-Sham-Arora

Punjab: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్‌కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. సుందర్ శామ్ అరోరా వద్ద నుంచి రూ.50 లక్షల లంచం స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసును మూసివేయడానికి విజిలెన్స్ అధికారి మన్మోహన్ శర్మకు రూ. 50 లక్షలు లంచం ఇస్తుండగా అరోరా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అధికారికవర్గాలు ధృవీకరించాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో అరోరా క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. మొహాలిలోని పంజాబ్ ఆనంద్ ల్యాంప్స్ లిమిటెడ్ (ఫిలిప్స్)కి చెందిన 25 ఎకరాల భూమిని బదిలీ చేయడం మరియు విభజన చేయడంలో జరిగిన అవకతవకల పై సుందర్ శామ్ అరోరా అనుమానితుడిగా ఉన్నారు. ఈ కేసులో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ బ్యూరో అనుమానిస్తోంది.

అంతేకాకుండా, సుందర్ శామ్ అరోరా అక్టోబర్ 14న తనను కలిశారని, తనపై నమోదైన విజిలెన్స్ విచారణలో సహకరించడానికి కోటి రూపాయల లంచం ఆఫర్ చేసారని ఏఐజీ మన్మోహన్ శర్మ ఫిర్యాదు చేశారని విజిలెన్స్ చీఫ్ వరీందర్ కుమార్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

 

Exit mobile version