Site icon Prime9

Supreme Court on NEET: నీట్‌ పరీక్షల్లో 0.001 శాతం నిర్లక్ష్యాన్ని సైతం సహించం : సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court on NEET: నీట్‌ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు పంపించింది. నీట్‌-యుజి పరీక్షల్లో తరచూ లీక్‌లు కావడంతో పాటు పలు అవకతవకలు జరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ నోటీసులకు కేంద్రంతో పాటు నేషనల్‌ టెస్టింగ్‌ఏజెన్సీ (ఎన్‌టీఐ) తమ స్పందన తెలపాలని కోర్టు కోరింది. కాగా నీట్‌-యూజి 2024 పరీక్షలో పలు అవకతవకలతో పాటు పేపర్స్‌ లీక్‌ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాగా సోమవారం నాడు నీట్‌ పరీక్షల పిటిషన్‌ సుప్రీంకోర్టు బెంచ్‌ విచారణకు వచ్చింది. పరీక్ష నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటామని బెంచ్‌ హెచ్చరించింది. వ్యవస్థలోని లోపాలను తనకు అనకూలంగా మలచుకొని డాక్టరు అయితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని బెంచ్‌ అభిప్రాయపడింది. కాగా ఈ కేసును జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, ఎస్‌బీఎన్‌ భట్టి బెంచ్‌ విచారణ చేపట్టింది. నీట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు కొన్ని నెలల పాటు ఎంతో కష్టపడుతుంటారు. వారి కష్టాన్ని ఇలా తేలికగా పోనియరాదని కోర్టు అభిప్రాయపడింది.

జూలై 8కి వాయిదా..(Supreme Court on NEET)

కేంద్రప్రభుత్వంతో పాటు ఎన్‌టీఏపై కోర్టులో నీట్‌ -యుజికి వ్యతిరేకంగా వేసిన కేసును విరోధి వ్యాజ్యంగా భావించరాదని.. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించింది. పరీక్షలను ఎన్‌టీఏ సక్రమంగా నిర్వహించాలి.. ఒక వేళ ఏవైనా తప్పులు దొర్లితే నిజాయితీ తప్పులు దొర్లాయని ఒప్పుకోవాలి. దీనికి తాము ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెప్పాలి. ఇలా చేయడం వల్ల మీపై నమ్మకం కుదురుతుందని ఎన్‌టీఏకు బెంచ్‌ చెప్పింది. లీక్‌లతో పాటు అవకతవకలపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కోర్టు పేర్కొంది. కాగా తదుపరి విచారణ జూలై 8కి వాయిదా పడింది. అయితే నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.

ఇదిలా ఉండగా నీట్‌ పరీక్షల లీక్‌లు కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. కాగా మంగళవారం నాడు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కూడా ప్రధానిపై మండిపడ్డారు. నీట్‌ పరీక్షలపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. విద్యార్థులకు అండగా ఉంటామని.. పార్లమెంటు నీట్‌ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెడతామని రాహుల్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు.

 

Exit mobile version