Jharkhand:మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది. అలంగీర్ జార్ఖండ్ అసెంబ్లీలో పాకుర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మాజీ చీఫ్ ఇంజనీర్ కేసు విచారణలో..(Jharkhand)
గత ఏడాది అరెస్టయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌పై మనీలాండరింగ్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. శాఖలోని కొన్ని పథకాల అమలులో జరిగిన అవకతవకలతో ఇది ముడిపడి ఉంది.బీహార్ , ఢిల్లీతో పాటు జార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్‌పూర్ మరియు ఇతర ప్రదేశాలలో ఈడీ బహుళ సోదాలు ప్రారంభించిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరి లో వీరేంద్ర కె రామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.2019లో, వీరేంద్ర కె రామ్ కింద పనిచేసే అధికారి నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా అధికారులు జార్ఖండ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన లావాదేవీల రికార్డులతో కూడిన పెన్ డ్రైవ్‌ను కనుగొన్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసును స్వీకరించింది.ఇలాఉండగా ఆలంగీర్ ఆలమ్‌ను తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలని,నగదు తరలింపుపై ప్రశ్నించాలని బీజేపీ డిమాండ్ చేసింది. జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. తాజా నగదు రికవరీతో కాంగ్రెస్ నల్లధన వ్యాపారంలో కూరుకుపోయిందని మరోసారి రుజువైందని అన్నారు.