Maharashtra: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను మద్యం తాగుతారా అని అడిగారంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడానికి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పర్యటించిన సత్తార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్టోబర్ 21న జిల్లాలోని గెవ్రాయి తాలూకాలో పంట నష్టాన్ని పరిశీలించారు.
గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో కలెక్టర్ శర్మ, జిల్లా అధికారులు, మరికొంత మందితో మంత్రి హాలులో కూర్చున్న దృశ్యం ఉంది. హాలులో ఉన్న సత్తార్ మరియు ఇతరులకు టీ అందించినప్పుడు, శర్మ టీ తాగడానికి నిరాకరించారు. ఈ సమయంలో, సత్తార్ కలెక్టర్‌ను “మీరు మద్యం తాగుతారా?” అని అడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మంత్రి తన వ్యాఖ్యల పై విమర్శలను ఎదుర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ ఇది వర్షాలకు నష్టం కలిగించే పర్యటననా లేదా ఆల్కహాల్ చూసే పర్యటనా? అని అడిగారు.