Site icon Prime9

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఇంటికి దిల్లీ పోలీసులు.. ఏం జరిగిందంటే?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి దిల్లీ పోలీసుల బృందం వెళ్లింది. స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాగర్‌ ప్రీత్‌ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్‌ లేన్‌లో ఉన్న రాహుల్‌ నివాసానికి వెళ్లారు.

కారణం ఇదేనా? (Rahul Gandhi)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటికి ఆదివారం దిల్లీ పోలీసులు వెళ్లారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ఆయన నుంచి స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఈరోజు ఇంటికి వెళ్లినట్లు సమాచారం. సోషల్‌ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయన్ని సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. తద్వారా వారికి మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో మహిళల లైంగిక దాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనని కొంతమంది మహిళలు కలిశారని.. ఇప్పటికీ తాము లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామని వాపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో అలా రాహుల్‌ను ఆశ్రయించినవారి జాబితాను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు.

 

మార్చి 16న ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల వివరాలు అడిగారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ చట్ట ప్రకారమే తగిన సమయంలో వివరణ ఇస్తామని చెప్పింది. అయితే స్పందిస్తామని చెప్పినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. బాధితుల వివరాలు వెల్లడిస్తే వారికి న్యాయం చేస్తామని, అందుకోసమే రాహుల్‌ను వారి వివరాలు అడుగుతున్నామని ఢిల్లీ స్పెషల్ సీపీ ఎస్పీ హుడా తెలిపారు.

Exit mobile version
Skip to toolbar