Covid Cases: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు కూడా రోజురోజుకు బాగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు కంటే 9 శాతం అధికంగా కేసులు నమోదు అయినట్టు తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు దగ్గరైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 49,622 గా ఉన్నాయి. కొవిడ్ కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ వేరియంట్ కారణంగానే(Covid Cases)
కరోనా బారినపడి ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా రోజు వారి పాజిటివిటీ రేటు 5. 01 శాతంగా ఉంది. ఒక వారం పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరుగుతున్న కొవిడ్ కేసులకు ఎక్స్ బీబీ.1.16 సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడించారు. ఆందోళన చెందకుండా కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మాస్కులు తప్పనిసరి
మరో వైపు ఢిల్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1,527 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూపీ నోయిడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. కార్యాలయ్యాల్లో శానిటైజేషన్ చేసి శుభ్రత పాటించాలని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించిన ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాలని సూచించింది.
50 శాతం పెరిగిన డ్రగ్స్ విక్రయాలు
కాగా.. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్‌ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతూ.. మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది.