Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ ప్లీనరి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో రాజకీయాల నుంచి సోనియా తప్పుకుంటున్నట్లు అందరు భావించారు. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. ఇంకా ఆ పార్టీ ఏమందంటే?
సోనియా గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ.. (Sonia Gandhi)
రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరిలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని కాంగ్రెస్ మాజీ అధినేత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు. నా రాజకీయ ఇన్నింగ్స్.. భారత్ జోడో యాత్రతో ముగిస్తుందని ఆమె చెప్పారు. దీంతో అందరూ ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా దూరం అవుతున్నారని భావించారు. తాజాగా ఆ పార్టీ దీనిపై సమాధానం ఇచ్చింది. ఇకపై పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టబోనని మాత్రమే దాని అర్ధం అని.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాదని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా ఉద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆ పార్టీ తెలిపింది.
సోనియా గాంధీ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు గందరగోళానికి గురయ్యారు. ఈ సమావేశంలో.. సోనియా భారత్ జోడో యాత్రతో ఇన్సింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మాటలతో.. సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అందరు అనుకున్నారు. కానీ రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టదని మాత్రమే ఆ మాటలకు అర్ధం వస్తుందని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. ఇక రానున్న ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటి చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. సోనియా గాంధీ ప్రసంగం పూర్తైన తర్వాత.. ఏఐసీసీ కుమారి సెల్జా దీనిపై వివరణ ఇచ్చారు.
భారత్ జోడో యాత్ర విజయవంతం..
ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడారు. భారత్ జోడో యాత్ర విజయవంతమైందని అన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ కు టర్నింగ్ పాయింట్ గా మారిందని తెలిపారు. భారత ప్రజల సామరస్యం.. సహనం, సమానత్వాన్ని తాను కోరుకుంటానని సోనియా తెలిపారు. భారత్ జోడో యాత్ర.. ప్రజలు, పార్టీ మధ్య సంబంధాలను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి, పోరాడటానికి వారు సిద్ధంగా ఉన్నారని ఈ యాత్ర ద్వారా తెలిసిందని సోనియా అన్నారు. 3600 కిలో మీటర్ల కష్టతరమైన పాదయాత్రను.. రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని అన్నారు. భారత్ జోడో యాత్ర కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు.. రాహుల్ గాంధీకి సోనియా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మల్లికార్జున ఖర్గేను సోనియా అభినందించారు. సుదీర్ఘ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సోనియా ఆకాంక్షించారు.
1998లో సోనియా తొలిసారిగా పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. సుమారు 25 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పని తీరు ఎంతో సంతృప్తినిచ్చిందని సోనియా అన్నారు. దీని తర్వాత భారత్ జోడో యాత్రతో ఆ సంతృప్తి రెట్టింపయిందని పేర్కొన్నారు. ఆ ఆనందంతోనే ఈ ఇన్నింగ్స్‌కు ముగింపు చెప్పాలనుకుంటున్నా అని సోనియా అన్నారు. సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగారు. 2019లో పార్టీ పరాజయం పాలవ్వడంతో దానికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా కొనసాగాల్సి వచ్చింది. గతేడాది నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గాంధీ కుటుంబం తమకు శ్రేయోభిలాషిగా ఉండే ఖర్గేకు మద్దతిచ్చి గెలిపించారు.