DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐదు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీ రావాల్సిందిగా డీకె శివకుమార్‌కు నోటీసులు పంపారు. ఈ నెల 15వ తేదీన శివకుమార్ దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. అయితే ఈడీ తనను ఏ కేసుకు సంబంధించిఎందుకు పిలుస్తుందో అర్ధం కావడం లేదన్నారు శివకుమార్. శివకుమార్‌తో పాటు పలువురు నాయకులు కూడా ఈడీ ముందు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా శివకుమార్‌కు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కొత్తగా శివకుమార్‌కు సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాను ఈడీకి పూర్తిగా సహకరించడానికి సిద్దంగా ఉన్నానని.. అయితే రాహుల్ భారత్ జోడో యాత్రలో తనను పాల్గొనకుండా నిలువరించేందుకు వేధింపులకు పాల్పడుతోందని శివకుమార్ తెలిపారు. కాగా సెప్టెంబర్3, 2019లో మరో మనీలాండరింగ్ కేసు కింద శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించి అదే ఏడాది బెయిల్ పొందారు. కాగా ఈడీ ఈ ఏడాది మేలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కొత్త చార్జీ షీటును ఫైల్ చేసింది.
ఇదిలా ఉండగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఈడీపై మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఈడీని పావుగా వాడుకుంటోందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఈడీ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని, ఇంతకు తన సోదరుడిని ఏ కేసుకు సంబంధించి సమన్లు పంపింది కూడా తెలియదన్నారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఈడీ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు సురేశ్. ఈడీ ఆఫీసు ప్రస్తుతం బీజేపీ కార్యాలయం అని.. ఇక్కడ బీజేపీ స్ర్కిప్ట్ రాసి ఇస్తే ఈడీ వాటిని అమలు చేస్తుందని సురేశ్ వ్యంగ్యంగా అన్నారు