Prime Minister Modi in Chhattisgarh: కాంగ్రెస్‌కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కుంభకోణంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనకు నమూనాగా మారిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దీనిని పాతరేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు.ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రాబోయే 25 ఏళ్లు కీలకం, అయితే దానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ‘పంజా’ (కాంగ్రెస్ పార్టీ గుర్తును సూచిస్తూ) ఎత్తైన గోడలా నిలుస్తోంది. కాంగ్రెస్ పంజా మీ హక్కులను లాక్కోవాలని నిర్ణయించుకుంది, అది రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేస్తుందని ఆయన అన్నారు.2018 అసెంబ్లీలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాల గురించి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది. రాష్ట్రంలో మద్యనిషేధం చేస్తానని ఆ పార్టీ హామీ ఇచ్చిందని, వాస్తవంగా కోట్లాది రూపాయల మద్యం కుంభకోణం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి కుంభకోణం సొమ్ము చేరిందని ఆరోపించారు.ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని.. అవినీతి మద్యానికే పరిమితం కాదని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరగని శాఖే లేదని.. ఈ ప్రభుత్వం దుష్టపాలనకు నిదర్శనంగా మారిందని మండిపడ్డారు.అవినీతి మరకలతో ఉన్న వారే నేడు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఒకరినొకరు దూషించుకున్న వారు ఏకమయ్యేందుకు సాకులు వెతుక్కుంటున్నారు. ఈ దేశంలోని ప్రతి అవినీతిపరుడు ఇది గమనించాలని మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు