Chandrababu Bail: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్, లిక్కర్ పాలసీ మరియు ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వాదనలు ముగియడంతో..( Chandrababu Bail)
ఈ కేసులకు సంబంధించి బెయిల్ కోరుతూ చంద్రబాబు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసారు. వీటిపై వాదనలు ముగిసిన నేపధ్యంలో హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జడ్జి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేసారు. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ కు కూడా బెయిల్ మంజూరయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు కు గత ఏడాది నవంబర్‌లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ గత ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడును అరెస్టు చేసింది. చంద్రబాబు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 31 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.