Nandigram co-op elections: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌లో ఆదివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ 12 స్థానాల్లో బీజేపీ 11 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
ఇదిలా ఉండగా, సహకార సంఘానికి ఆదివారం జరిగిన ఎన్నికలో రెండు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఎంసీ బయటి వ్యక్తులను తీసుకురావడం ద్వారా ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిందని, అయితే సాధారణ ఓటర్లు తమ ప్రణాళికను విఫలం చేశారని గెలిచిన బీజేపీ నేతలు పేర్కొన్నారు. టి.ఎం.సి సభ్యుడని చెప్పుకునే స్థానిక పంచాయతీ సభ్యుడి పై కొంతమంది మహిళలు దాడిచేసి అతని చొక్కా చింపేసినట్లు స్దానిక న్యూస్ చానెళ్లు పేర్కొన్నాయి. నందిగ్రామ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అతన్ని రక్షించారు.
నందిగ్రామ్ ప్రతిపక్షనేత సువేందు అధికారికి గట్టిపట్టున్న ప్రాంతం. 2021 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అతను నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సువేందు సీఎం అయ్యేవారు. అయితే బీజే పీ 100 సీట్లకు దగ్గరగా వచ్చి నిలిచిపోయింది.