Site icon Prime9

Delhi municipal elections: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ

DELHI

DELHI

Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ట్రెండ్స్ బట్టి ఆప్ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆప్ స్వల్ప ఆధిక్యంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆప్ 250 వార్డులకు గాను ఆప్ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇప్పుడు 109 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ ఏకపక్షంగా స్వీప్ చేస్తుందని అంచనా వేసాయి. కానీ ప్రస్తుతం ట్రెండ్ భిన్నంగా ఉండటంతో ఆప్ నేతలు సందిగ్ధంలో పడ్డారు. మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ ఆప్ రికార్డు స్థాయిలో 67 సీట్లు గెలుచుకున్నప్పటికీ, రెండేళ్ల తర్వాత బీజేపీ తన 272 సీట్లలో 181 సీట్లతో ఢిల్లీకార్పోరేషన్ ను నిలబెట్టుకుంది. ఆప్‌ 48తో రెండో స్థానంలో, కాంగ్రెస్‌ 30తో మూడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మురికివాడల్లో నివసించే ప్రజలకు గృహవసతిని కల్పిస్తామని హామీ ఇవ్వగా ఆప్ ఢిల్లీ నగరంలో చెత్త సమస్యను నిర్మూలిస్తామని తెలిపింది. కార్పోరేషన్ ఎన్నికలముందు ఆప్ మంత్రులు, నేతలపై ఈడీ దాడులు, అవినీతి ఆరోపణల గురించి కూడ బీజేపీ ప్రచారంలో పేర్కొంది. అయితే సీఎంగా తన పనితీరును మరుగుపరచడానికి బీజేపీ బూటకపు ఆరోపణలు చేస్తోందని కేజ్రీవాల్ తిప్పి కొట్టారు.

2019లో షీలా దీక్షిత్ మరణించిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపించలేకపోతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పోటీ ఇవ్వలేకపోయింది. అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో నాయకులు ప్రచారం పై కూడ పెద్దగా దృష్టి సారించలేదు.

Exit mobile version