Site icon Prime9

Bhupendra Patel : గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్

Bhupendra Patel

Bhupendra Patel

Bhupendra Patel : గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేశారు.ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు బీజేపీ 156 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం. కాంగ్రెస్ 17 స్థానాలు, ఆప్ ఐదు స్థానాలు గెలుచుకోగా.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు పటేల్ తన మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేశారు. నిన్న ఆయన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఆయన గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘట్లోడియా స్థానంలో తన ప్రత్యర్థిపై పటేల్ 1.92 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఏడాది సెప్టెంబరులో విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో పటేల్ గుజరాత్ పగ్గాలు చేపట్టారు.

భూపేంద్ర పటేల్‌ 1962 జూలై 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. 1982 ఏప్రిల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో చేరారు. తొలుత అహ్మదాబాద్‌ జిల్లాలోని మేమ్‌నగర్‌ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సేవలందించారు.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి శశికాంత్‌ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్‌ 13న గుజరాత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా ఇవాళ మరోసారి గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Exit mobile version