Site icon Prime9

Air Pollution: ఢిల్లీలో కాలుష్యంతో వాహనాలకు సరి-బేసి విధానం.. ఎప్పటినుంచో తెలుసా?

Air Pollution

Air Pollution

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు దారుణంగా క్షీణిస్తున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరగడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ ‘సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు.

10, 12వ తరగతుల వారికి మినహా ..(Air Pollution)

నవంబరు 13 నుంచి 20వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అటు పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతుల వారికి మినహా అన్ని స్కూళ్లకు నవంబరు 11 వరకు సెలవులు ప్రకటించినట్లు గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇక నిర్మాణ కార్యక్రమాలపై పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రహదారులు, వంతెనల వంటి ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణ పనులను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్‌3 పెట్రోల్‌, బీఎస్‌4 డీజిల్‌ వాహనాలపై నిషేధం కొనసాగుతుందన్నారు. కేవలం అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ ట్రక్కులను మాత్రమే దిల్లీలోకి అనుమతిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి గోపాల్‌రాయ్‌ వివరించారు.

Exit mobile version