Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు. ఈ సందర్బంగా తన తాజా చిత్రం “రామసేతు”ని చూడవలసిందిగా కుమార్ ఆదిత్యనాథ్‌ను కోరారు.
35 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ చుట్టూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ నెలకొందని అక్షయ్ కుమార్ యూపీ సీఎంకు తెలియజేశారు. యూపీలోని ఫిల్మ్‌సిటీ నిర్మాణం కోసం చాలా మంది పెద్ద నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎదురుచూస్తున్నారని సీఎం ఆదిత్యనాథ్‌కు ఆయన చెప్పినట్లు తెలిసింది. యూపీలో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిటీని అభివృద్ధి చేయడం వల్ల సినిమా బిజినెస్‌లో ఉన్నవారు తమ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేసుకునేందుకు కొత్త ఆప్షన్‌ను అందిస్తుందని ఆయన అన్నారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో సినిమా పాత్ర ఎంతో ఉందని, సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకునేటప్పుడు సామాజిక, జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలకు చిత్ర నిర్మాతలు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోగి అన్నారు. యూపీలోని ఫిల్మ్ సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, కొత్త ఫిల్మ్ పాలసీని కూడా రూపొందిస్తున్నామని చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లో పర్యటించాల్సిందిగా అక్షయ్‌కుమార్‌ను ఆదిత్యనాథ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.