Bihar: గత 40 ఏళ్లుగా మాన్యువల్ స్కావెంజర్‌గా పనిచేస్తున్న మహిళను నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయ ఓటర్లు చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో, చింతా దేవి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.
అయితే, గయ ప్రజలకు ఇది కొత్త విషయం కాదు. ఇదే నగరానికి చెందిన ఓటర్లు ఇంతకు ముందు 1996లో అత్యంత అట్టడుగున ఉన్న ముసహర్ సామాజికవర్గానికి చెందిన మహిళ మరియు వృత్తి రీత్యా స్టోన్ క్రషర్ అయిన భగవతీ దేవిని లోక్‌సభకు ఎన్నుకున్నారు. భగవతీ దేవి నితీష్ కుమార్ JD(U) టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సందర్బంగా గయా మేయర్ గణేష్ పాశ్వాన్ ఇలా అన్నారు: గయా అనేది ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం. ఒక ముసహర్ మహిళ లోక్‌సభకు వెళ్లే ప్రదేశం కూడా ఇదే. . ఇక్కడ మరుగుదొడ్లు తక్కువగా ఉన్నప్పుడు మానవ మలాన్ని తలపై మోసిన చింతా దేవినిఎన్నుకోవడం ద్వారా బహుశా యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణ గా నిలచింది. ఇది చరిత్రాత్మకమన్నారు.
మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ మద్దతు ఉన్న చింతా దేవి గతంలో పారిశుధ్య కార్మికురాలిగా మరియు కూరగాయల అమ్మకందారుగా పనిచేశారు. ఎన్నికల్లో గెలిచి చింతాదేవి చరిత్ర సృష్టించారని శ్రీవాస్తవ అన్నారు. చింతాదేవి నగర ప్రజలు అణగారిన వర్గాలకు అండగా ఉంటారని, వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు.