Assam Floods: అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.
తిండి, నీళ్లు లేవు..(Assam Floods)
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,744 మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. వీరిలో 4,697 మంది పిల్లలు, 9,874 మంది మహిళలు ఉన్నారు. సహాయక శిబిరాల వెలుపల 3,61,206 మంది ఉన్నారు, ఇక్కడ 80,854 మంది పిల్లలు మరియు 1,22,126 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు కొంతమంది ప్రభుత్వ సాయం కోసం చూడకుండా తమకు తామే తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని తలదాచుకుంటున్నారు. ఇటువంటి వారికి ఆర్దికసాయం సరిగా అందడం లేదన్న విమర్శలు వచ్చాయి. శిబిరంలో తలదాచుకుంటున్న 80 ఏళ్ల ఫులమాల దాస్ మాట్లాడుతూ ఇక్కడ మేము పిల్లలు మరియు జంతువులు కలిసి జీవిస్తున్నాము. ప్రభుత్వం నుంచి తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వలేదు. కొన్ని ప్రైవేట్ ఎన్జీవోలు నీళ్లు, బిస్కెట్ల సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. లేకుంటే మేము బ్రతకలేమని వాపోయారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో ఉంటున్న మరో వ్యక్తి ఇలా కలిత మాట్లాడుతూ, రాత్రి సమయంలో నీరు మా ఇంట్లోకి ప్రవేశించి అన్నింటినీ కొట్టుకుపోయింది. మేము వ్యవసాయంపై ఆధారపడిన మనుషులం, మా వరి పొలాలు అన్నీ నాశనమయ్యాయి. ఆవులు, మేకలు, గేదెలు వంటి పశువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి.తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు కొంతమేరకు ఉపశమనం లభించింది. అయితే మాలాంటి వారి సంగతేంటి? ఇప్పుడు మాలాగే లక్షలాది మంది జీవిస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ఎందుకు సంసిద్ధత లేదు? మనం ఎలా బతుకుతాం? ఆసుపత్రులు, పాఠశాలల్లో ఎక్కడ చూసినా నీరు చేరి మా జీవితాలను స్తంభింపజేసిందంటూ విలపించారు.
చైనా రిజర్వాయర్లు నిర్మిస్తే..
అసోంలో వరద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా అస్సాంలో వరదలు సంభవించాయి. వరద అరుణాచల్ వైపు నుండి ఎగువ అస్సాంలోకి ప్రవేశిస్తుంది, ఇది మొత్తం అస్సాంను ముంచెత్తుతోందని అన్నారు. చైనా రిజర్వాయర్లను నిర్మించినప్పుడే, వరదల దుస్థితి నుండి మనం బయటపడగలం అని వ్యాఖ్యానించారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శర్మ పరిశీలించారు.శుక్రవారం కూడా, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు ఉన్నాయి, అస్సాంలోని ప్రధాన నదులన్నీ ఇప్పటికీ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.