Opposition MPs: 31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపీల బృందం అక్కడి పరిస్థితిని రాష్ట్రపతికి వివరించింది. రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాం. మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు, పునరావాసం మరియు ఇతర పరిస్థితులపై మేము రాష్ట్రపతికి వివరించాము. ప్రధాని మణిపూర్‌లో పర్యటించి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలన్నది మా ప్రధాన డిమాండ్ అని ప్రతినిధి బృందంలో భాగమైన డిఎంకె ఎంపి టి శివ తెలిపారు.
జూలై 29-30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)కి చెందిన 21 మంది ఎంపీలు కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై సమగ్ర చర్చ అనంతరం పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నెరవేరని నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. మణిపూర్ సమస్యపై చర్చించడానికి ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్రపతిని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రాష్ట్రపతి బుధవారం ఉదయం 11.30 గంటలకు వారికి సమయం ఇచ్చారు.