Site icon Prime9

2000 Note withdraw: చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకే 2 వేల నోట్ల ఉపసంహరణ

2000 Note withdraw

2000 Note withdraw

2000 Note withdraw: రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘తొలిసారి డీమానిటైజేషన్‌తో ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో అసంఘటిత రంగంపై భారీ దెబ్బ పడింది. ఎంఎస్‌ఎంఎఈ సెక్టార్‌ కుదేలైంది. కోట్లాది ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ‘రెండో డీమానిటైజేషన్‌’ద్వారా తప్పుడు నిర్ణయాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారా? దీనిపై విచారణతోనే నిజాలు తెలుస్తాయి’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ చర్యను కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఖండించాయి.

 

 

అవినీతి ఆ స్థాయిలో పెరిగిందంటారా(2000 Note withdraw)

రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ కూడా రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. ‘చలామణిలో ఉన్న నగదు అవినీతికి ముడిపడి ఉంటుందని అప్పట్లో ప్రధాని మోదీ అన్నారు. మరి 2016 లో రూ. 17.7 లక్షల కోట్లుగా ఉన్న నగదు సర్క్యులేషన్‌.. 2022 నాటికి రూ. 30.18 లక్షల కోట్లకు పెరిగింది. దీని అర్ధం అవినీతి ఆ స్థాయిలో పెరిగిందంటారా మోదీజీ..?’ సిబల్ ప్రశ్నించారు.

‘బీజేపీ, మోదీజీ ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మార్చలేరు. కర్ణాటకలో ఓడిపోయారు. మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఓటమి తప్పదు. అదానీని రక్షించలేరు. తమ కరెన్సీ నోట్లు ఎపుడు టాయిలెట్ పేపర్లుగా మారిపోతాయో అనే భయం దేశ ప్రజలు వెంటాడుతోంది’ తృణమూల్ ఎంపీ మహునా మొయిత్రా పేర్కొన్నారు.

 

సెప్టెంబర్‌ 30 వరకు నోట్ల మార్పడి

కాగా, రిజ్వర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తక్షణమే ఈ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను కూడా ఆదేశించింది. సెప్టెంబర్‌ 30 వరకు నోట్ల మార్పడి చేసుకోవాలని ప్రజలకు అవకాశం కల్పించింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లు మార్చుకునే వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. 2016 నోట్ల రద్దు సందర్భంగా రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది. అదే విధంగా ఒక విడతలో రూ. 20 వేల చొప్పున మాత్రమే 2 వేల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలను ఆర్బీఐ విధించలేదు. బ్యాంకులకు సంబంధించి రోజు వారీ విధులకు ఆటంకాలు కలగకుండా నోట్ల మార్పిడి ప్రక్రియన చేపట్టాలని ఆర్బీఐ సూచించింది.

Exit mobile version